రసవత్తరంగా రెండో టెస్ట్..

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసత్తవరంగా సాగుతోంది.. తొలి రోజు ఒక సెషన్ ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో సెషన్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించింది.

Update: 2023-02-18 14:56 GMT

బ్యాటింగ్ తో ఆదుకున్న అక్షర్, అశ్విన్..

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసత్తవరంగా సాగుతోంది.. తొలి రోజు ఒక సెషన్ ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో సెషన్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. చివరకు తొలిరోజునే ఆసీస్‌ను ఆలౌట్ చేసింది. ఇక రెండోరోజు ఆట మొదలైన కాసేపటికే భారత జట్టు వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే రోహిత్ (32), రాహుల్ (17), పుజారా (0) వెంట వెంటనే అవుటయ్యారు. దీంతో ఆసీస్ పైచేయి సాధించింది. ఇలాంటి సమయంలో కోహ్లీ (44), శ్రేయాస్ అయ్యర్ (4) ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే అయ్యర్ విఫలమవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. అప్పుడు కోహ్లీకి జడేజా (26) జత కలవడంతో లంచ్ వరకు ఆట సాఫీగా సాగింది. ఆ తర్వాత కాసేపటికే రవీంద్ర జడేజా అవుటయ్యాడు. ఇది జరిగిన తర్వాత కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అరంగేట్ర ఆటగాడు కునెమన్ వేసిన డెలివరీని డిఫెండ్ చేయబోయి విఫలయ్యాడు.

కోహ్లీ అవుట్‌పై వివాదం..

కోహ్లీ అవుటైన విధానం వివాదాస్పదమైంది. బంతి ముందుగా బ్యాటును తాకి, ఆ తర్వాత ప్యాడును తాకిందా? లేక ముందు ప్యాడ్‌ను తాకిందా స్పష్టంగా కనిపించలేదు. ఈ క్రమంలో కోహ్లీ రివ్యూ తీసుకున్నా కూడా ఫలితం మాత్రం ఆస్ట్రేలియాకు అనుకూలంగా వచ్చింది. దీంతో కోహ్లీ కూడా నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే కేఎస్ భరత్ (6) కూడా అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో జోడీ కట్టిన అక్షర్ పటేల్ (74), రవిచంద్రన్ అశ్విన్ (37) భారత్‌ను ఆదుకున్నారు. ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు.

ఆదుకున్న అక్షర్, అశ్విన్..

అక్షర్, అశ్విన్ చక్కగా ఆడటంతో భారత్ పైచేయి సాధించినట్లే కనిపించింది. అయితే కమిన్స్ బౌలింగ్‌లో అశ్విన్ అవుటవడంతో భారత బ్యాటింగ్ లైనప్ పూర్తయింది. ఇక బ్యాటర్లు ఎవరూ లేరు. అయినా సరే కొంత పోరాడిన అక్షర్ పటేల్.. షమీ సహకారంతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత అతను కూడా అవుటయ్యాడు. అయితే చివర్లో అశ్విన్, అక్షర్ ఇన్నింగ్స్‌తో భారత జట్టు 262 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాను జడేజా దెబ్బతీశాడు.

ఆసిస్ ఆచితూచి...

రెండో రోజు ఆటలో ఎక్కువ ఓవర్లు లేకపోవడంతో ఒత్తిడిలో ఉన్న భారత్‌పై పైచేయి సాధించేందుకు ఆసీస్ ప్రయత్నించింది. ఈ క్రమంలోనే భారత స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న జడేజా.. ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేశాడు. జడ్డూ బౌలింగ్‌లో అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చిన అతను పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ పైచేయి సాధించినట్లు కనిపించింది. కానీ మార్నస్ లబుషేన్ (19 నాటౌట్), ఓపెనర్‌గా వచ్చిన ట్రావిస్ హెడ్ (39 నాటౌట్) ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు 61/1 స్కోరుతో నిలిచింది. దీంతో ఈ రోజును కూడా రెండు జట్లు పంచుకున్నాయి. హోరాహోరీగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో చివరకు విజయం ఎవరిని వరిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read...

బ్రేకింగ్: తొలి ఇన్సింగ్స్‌లో భారత్ ఆలౌట్.. చివర్లో ఆదుకున్న అక్షర్ పటేల్

Tags:    

Similar News